వరంగల్ అర్బన్: మహా నగర పరిధి వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో బహిరంగ ప్రచారంపై బల్దియా సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో నిర్మితమైన బహుళ అంతస్తులకు ఎదురుగా ప్రధాన రహదారిపై చిరువ్యాపారులు, దళారులు ఏర్పాటు చేసిన డబ్బాలు, తాత్కాలిక గదులను తొలగించిన టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం, డీఆర్‌ఎఫ్ అధికార యంత్రాంగం గురువారం హనుమకొండలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్, మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించారు. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు లేదా ఇతర సంస్థలు మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయరాదని కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


