కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రిక్విజిషన్ లెటర్లు లేక ధర్మచిట్టీలపై రాస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వైద్య పరీక్షల కోసం వచ్చిన పేషెంట్లకు అవసరమైన ఎక్స్‌రే, ల్యాబ్ పరీక్షలకు ఇవ్వాల్సిన రిక్విజిషన్ల ఫామ్‌లు లేక చిన్న కాగితాలపై రాయడంతో సంబంధిత సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు ఇలా రాస్తే మేం పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఎక్కడ రాయాలంటూ ఎక్స్‌రే, ల్యాబ్ సిబ్బంది వాపోతున్నారు. కనీసం ఖాళీ పేపర్ వెనుక కూడా ప్రింటింగ్ అక్షరాలు ఉండడంతో రిపోర్టు పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో ఎక్స్‌రేతో పాటు వివిధ ల్యాబ్ పరీక్షలకు సమస్యలు తప్పట్లేదు. కాగా, స్టేషనరీ విభాగానికి సంబంధించిన దాదాపు రూ.కోటి టెండర్‌దారుడికి చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలు ఇవ్వనిదే తాము స్టేషనరీ సరఫరా చేయలేమంటూ వారు చెబుతున్నట్లు సమచారం. దీనిపై అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.


