పరోక్ష పద్ధతిలో
టెస్కో చైర్మన్ ఎంపిక..
కాశిబుగ్గ: టెస్కో (తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకారం సంఘం లిమిటెడ్) ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముందుగా డైరెక్టర్ల పదవుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఆయా ప్రాంతాల్లో చేనేత సహకార సంఘాల నూతన కార్యవర్గం, అధ్యక్ష, కార్యదర్శులు ఎంపిక పూర్తయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 20 వరకు చేనేత ఎన్నికల కోసం పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయి అధ్యక్ష స్థానంలో ఆసీనులయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని చేనేత సహకార సంఘాల్లో నూతన కార్యవర్గాన్ని రిటర్నింగ్ అధికారులు ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లాలో 18, జనగామ జిల్లాలో 11, వరంగల్ జిల్లాలో 27, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో (గతంలోని చేర్యాల) 1 చొప్పున మొత్తం 63 సంఘాలకు చాలా చోట్ల ఏకగ్రీవంగా డైరెక్టర్లను ఎన్నుకోవడంతో కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కాగా, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల చేనేత సహకార సంఘానికి ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది.
డైరెక్టర్ పదవి కోసం ముందు వరుసలో
ఉన్న అధ్యక్షులు..
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో అప్పుడే డైరెక్టర్ పదవి కోసం ఆయా సంఘాల్లో గెలిచిన అధ్యక్షులు ముందు వరుసలో వస్తున్నారు. గతంలో ఆప్కో మాజీ చైర్మన్‌గా పనిచేసినవారు, టెస్కోలో రిటైర్డు అయిన వారు సైతం డైరెక్టర్ పోటీలో ఉన్నట్లు సమాచారం. కాగా, టెస్కో డైరెక్టర్ల పదవుల పోటీలో మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, టెస్కో రిటైర్డు అధికారి ఎస్.వెంకట్రాంనర్సయ్య, కొత్తవాడ షతరంజ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యెలుగం సాంబయ్య, దేశాయిపేట, సెకండ్ డాక్టర్స్ కాలనీ విశాలాక్ష్మి చేనేత సహకారం సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సంపత్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు చేర్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి ఉంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆప్కో చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున చేనేత సహకార సంఘాల అధ్యక్షులను డైరెక్టర్లుగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా ఏర్పడింది. దీనికోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది ఉమ్మడి జిల్లాలకు గాను ఒక్కో డైరెక్టర్‌ను, మహబూబ్‌నగర్‌లోని జిల్లాలోని ఓ ఉన్ని సహకార సంఘానికి మరో డైరెక్టర్‌ను ఎన్నుకోవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని పరోక్ష పద్దతి ద్వారా టెస్కో చైర్మన్‌గా ఎంపిక చేయాల్సి ఉంది.
డైరెక్టర్ల పోస్టుల బరిలో ఉంటామని చెప్పుకుంటున్న సంఘాల అధ్యక్షులు
ఇంకా వెలువడని నోటిఫికేషన్..
అయినా అంతర్గతంగా ప్రచారం
చేసుకుంటున్న ఆశావహులు


