వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్(30) హైదరాబాద్‌లో హత్యకు గురికావడంతో బంధువులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. భాస్కర్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసముంటూ ఓ ప్రైవేట్ హాస్టల్‌లో కుక్‌గా పని చేస్తున్నాడు. కాగా, గతంలో భాస్కర్ ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అనంతరం 3 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. పైళ్లెన అనంతరం ఆ యువతి భాస్కర్‌తో మాట్లాడుతుందనే అనుమానంతో భర్త ఇటీవల విడాకులు ఇచ్చాడు. దీంతో తమ కూతురు వైవాహిక జీవితం పాడవడానికి భాస్కర్ కారణమని యువతి కుటుంబీకులు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతి తండ్రి, మేనమామతోపాటు మరి కొందరు భాస్కర్ వద్దకెళ్లి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కోపోద్రెకులైన మృతుడి బంధువులు, కులస్తులు బుధవారం స్వగ్రామం ఉప్పరపల్లిలో ఆ యువతి తండ్రి ఇంటిపై దాడికి దిగారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా, గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, భాస్కర్ మృతదేహాన్ని రాత్రి 11 గంటలకు స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో కరెంట్ పోయి అరగంట తరువాత వచ్చింది పోలీసులే కరెంటు నిలిపివేశారని బంధువులు ఆరోపించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
దళిత సంఘాల ధర్నా..
మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు భాస్కర్‌ను హత్య చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.
మాదాపూర్ హత్యతో కలకలం
మృతుడి బంధువుల ఆందోళన


