ఫ్యాన్సీ నంబర్లు ఎలా
పొందుతున్నారంటే..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫ్యాన్సీ వాహన నంబర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు విలాసవంతమైన కార్ల యజమానులు మాత్రమే ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్ని వర్గాల వాహనదారులు తమ అదృష్ట సంఖ్య (లక్కీ నంబర్) కోసం రూ.వేల నుంచి రూ.లక్షలు వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఒకే నంబర్‌కు పలువురు పోటీ పడుతుండటంతో రవాణాశాఖ ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నంబర్లను కేటాయిస్తోంది. ఇలా ఉమ్మడి వరంగల్‌లో ఏడాదిగా ఆర్టీఏకు రూ.4,17,07,550 ఆదాయం సమకూరింది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది జ్యోతిష్యులు, న్యూమరాలజీ నిపుణుల సలహాలతో తమకు అనుకూలంగా భావించే సంఖ్యలను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1, 9, 9999, 1111, 7777, 8888 వంటి సంఖ్యలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒకే నంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆన్‌లైన్ వేలం నిర్వహించి, అత్యధిక మొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చిన వ్యక్తికి ఆర్టీఏ అధికారులు లక్కీ నంబర్‌ను కేటాయిస్తున్నారు.
జిల్లాల వారీగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా వచ్చిన ఆదాయం
జిల్లా (రూ.లక్షల్లో..)
హనుమకొండ 1,84,41,796
వరంగల్ 98,12,148
జనగామ 49,59,928
జేఎస్ భూపాలపల్లి 41,35,012
మహబూబాబాద్ 31,45,066
ములుగు 12,13,600
వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కావాలనుకునే వారు తెలంగాణ రవాణాశాఖ పోర్టల్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒకే నంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించి, అత్యధిక మొత్తం బిడ్ చేసిన వారికి నంబర్‌ను కేటాయిస్తారు. రిజర్వ్ అయిన నంబర్‌ను 15 రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్‌కు వినియోగించాలి. ఒకే నంబర్‌కు పోటీ ఎక్కువైతే నిర్ణయించిన కనీస ఫీజు కంటే అధిక మొత్తాన్ని బిడ్డింగ్‌లో చెల్లించి ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకోవాలని వరంగల్, హనుమకొండ డీటీసీ సురేష్ రెడ్డి తెలిపారు.
లక్కీ నంబర్ చేజిక్కించుకునేందుకు రూ.లక్షల్లో ఖర్చు
కారు యజమానులతోపాటు
ద్విచక్ర వాహనదారుల సైతం పోటీ
ఏడాదిలోనే ఆర్టీఏకు
రూ.4 కోట్లకుపైగా ఆదాయం


