కల్పలత సూపర్ బజార్‌పై సమగ్ర దర్యాప్తు
హన్మకొండ: కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్ (కల్పలత సూపర్ బజార్)పై సమగ్ర దర్యాప్తునకు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఆదేశాలు జారీ జేశారు. ఈమేరకు ఆర్‌సీ నంబర్ 2518/2025–బి, తేదీ 17–12–2025తో ప్రొసీడింగ్ జారీ చేశారు. కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్‌లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరుపగా ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టం సెక్షన్ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తుకు జిల్లా సహకార అధికారి ఆదేశాలు జారీ చేశారు. పరకాల సర్కిల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్.శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.
హన్మకొండ అర్బన్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న (శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి యం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేటలోని హెచ్‌ఆర్‌హెచ్, వరంగల్‌లోని కార్స్ ఫిన్‌టెక్, వెస్ట్ సైడ్, విజయ ఫర్టిలైజర్స్, హైదరాబాద్‌లోని నికోమాక్, హెట్రో ప్రొడక్షన్, గ్రోవెల్ ఫీడ్స్ కంపెనీల్లో టెలీకాలర్స్, రిటైల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్, ప్రొడక్షన్, మార్కెటింగ్ శాఖలోని 70 ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్స్‌త్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్‌లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్‌కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్‌ధర్, రాజ్‌శేఖర్‌సింగ్, దృవ్ కర్నాకర్‌లు ది సిక్స్‌త్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్‌ఫైనల్‌కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్ మీట్–2025(పర్ మెన్, అండ్ ఉమెన్) ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కుమారస్వామి బుధవారం తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.


