నేడే తుది సం‘గ్రామం’
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతలుగా పూర్తికాగా, బుధవారం మూడో విడతలో హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు, వరంగల్ జిల్లాలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా మండలకేంద్రాల్లో మంగళవారం ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలనుంచి సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని వారికి కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. పోలింగ్ బూత్‌లను సిద్ధం చేసుకున్నారు. బుధవరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తదనంతరం లెక్కింపు, విజేతలను ప్రకటిస్తారు.
హనుమకొండ జిల్లాలో..
68 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, 634 వార్డులకు 71 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 230 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,424 మంది బరిలో ఉన్నారు. 666 పోలింగ్ కేంద్రాలు, 897 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరు మొత్తంగా 1,11,822 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్‌నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు.
వరంగల్ జిల్లాలో...
జిల్లాలో మొత్తం 102 పంచాయతీలకు 312 మంది, 890 వార్డుల కోసం 1,974 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు, దాడులు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడ గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,28,756 మంది ఓటర్లు ఉండగా అందులో 63,059 మంది పురుషులు, 65,690 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే నాలుగు మండలాలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అమీనాబాద్ పంచాయతీ ఫలితం కూడా జనాల్లో ఆసక్తిని రేపుతోంది.
నేడే తుది సం‘గ్రామం’
నేడే తుది సం‘గ్రామం’


