కల్పలత కో–ఆపరేటివ్ సొసైటీలో కుంభకోణం
రామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్‌లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం, అందులో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉండడంపై ధ్వజమెత్తారు. రిజిస్టర్, జమ, ఖర్చులు, తదితర రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు.
కలెక్టర్ దృష్టికి..
గత పాలకుల సమయంలో సభ్యత్వ నమోదులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే నాయిని గుర్తించారు. సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారి పట్టించి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని తెలుసుకున్నారు. పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించిన డీజిల్, పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా చెల్లించలేదని, కో–ఆపరేటివ్ ఆధీనంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, వారి వివరాలు రిజిస్టర్‌లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవని తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫోన్ చేసి కార్యాలయంలో రిజిస్టర్లను వెంటనే జప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్ప లత సూపర్ బజార్‌లో జరుగుతున్న అవకతవకలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
లేని బస్సుల పేరిట బిల్లులు,
లేని ఉద్యోగులను సృష్టించి
జీతాలు వసూలు
రికార్డులు స్వాధీనం చేసుకుని విచారించిన అధికారులు


