ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దామెర, ఆత్మకూరు, శాయంపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
1,991 మంది పోలీస్ సిబ్బంది..
ఎన్నికల నిర్వహణకు 1,991 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్‌న్‌స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 339 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని సీపీ వెల్లడించారు.
రేపు ఉదయం వరకు నిషేధాజ్ఞలు..
రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్‌బాబు, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


