విలీన గ్రామాలపై దృష్టి సారించండి
సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి,
వరంగల్ అర్బన్: విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో కలిసి 15, 16, 17 డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం కావాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు జంక్షన్ల విస్తరణకు చొరవ తీసుకోవాలన్నారు. డివిజన్లలోని రామకృష్ణాపురం, ఏకశిల జంక్షన్లను అభివృద్ధి చేయాలని, గొర్రెకుంటలో అంబేడ్కర్ జంక్షన్‌కు చెందిన ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్‌ఈ సత్యనారాయణ, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ గోపాల్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంతోష్‌బాబు, మాధవీలత, డీఈ సతీశ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


