వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి..
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్‌తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈమేరకు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించిన ఏఈలను అభినందించారు. సమావేశంలో హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు ఐరెడ్డి విజేందర్‌రెడ్డి, జి.సాంబరెడ్డి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవీ పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్‌వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వారం రోజులుగా ట్రై సిటీ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 437 కేసులు నమోదైనట్లు వరంగల్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.1,58,200 జరిమానా విధించడంతో పాటు 24 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ట్రాఫిక్ పరిధిలో నమోదైన 158 కేసుల్లో 14 మంది జైలు శిక్ష విధించగా, రూ.72,900 జరిమానా, కాజీపేట పరిధిలో 142 కేసుల్లో 9 మందికి జైలు శిక్ష, మిగతా కేసుల్లో రూ.79,500 జరిమానా, హనుమకొండ ట్రాఫిక్ పరిధిలో 137 కేసులకు రూ.5,800 జరిమానాతో పాటు ఒక్కరి జైలు శిక్ష విధించినట్లు సీపీ వెల్లడించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీకు, మీ కుటుంబానికి క్షేమకరం సీపీ సూచించారు.
పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు
ఈ నెల 17న కమిషనరేట్ పరిధి వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో జరిగే మూడో విడత ఎన్నికల్లో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్, ఎస్‌ఆర్‌పీసీ 163 ( 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈనిషేధాజ్ఞలు 17 తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.


