అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనధికారిక భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కౌన్సిల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తుదారులతో కార్యాలయ ఆవరణంతా కిటకిటలాడింది. గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 117 ఫిర్యాదులు అందగా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 63 వచ్చాయి. నగరంలో ఎంత పెద్ద మొత్తంలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ ఫిర్యాదుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 41, పన్నుల విభాగానికి 4, ప్రజారోగ్య సెక్ష న్‌కు 3, నీటి సరఫరాకు 5, ఉద్యాన వన విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్‌లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● వరంగల్ దేశాయిపేట చార్‌లెస్ కాలనీ రోడ్డు–1లో డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్గనైజర్స్ కోరారు.
● వరంగల్ 25వ డివిజన్ ఎల్లంబజార్ రిషి స్కూల్ లైన్‌లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.
● మట్టెవాడ 13–3–52 వద్ద తాగునీటి పైపులైన్ నెల రోజులుగా లీకేజీగా మారి నీరు వృథాగా పోతోందని, రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 19వ డివిజన్ గాంధీనగర్‌లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని రామా యాదగరి విజ్ఞప్తి చేశారు.
● 2028లో లక్ష్మీటౌన్ షిప్ నుంచి ఆరేపల్లి వరకు రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేపట్టారని, కానీ, కొన్నేళ్లకు రోడ్డు దెబ్బతిందని మరమ్మతులు చేపట్టాలని ఇట్యాల సురేశ్‌కుమార్ కోరారు.
● వరంగల్ చింతల్‌లో నల్లాలు, డ్రెయినేజీలు లేవని, రోడ్లు నిర్మించాలని మహ్మద్ అంకూస్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
● వరంగల్ 28వ డివిజన్ విశ్వకర్మ, చకిలం ఉపేందర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానిక కార్పొరేటర్ గందె కల్పన అర్జీ పెట్టుకున్నారు.
● 62వ డివిజన్ విష్ణుపురి రెహ్మత్ నగర్ మరుగుదొడ్ల నుంచి మల వ్యర్థాలను నేరుగా డ్రెయినేజీలకు పంపిస్తుండడంతో దుర్వాసన వస్తోందని మాట్ల రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.
● హంటర్ రోడ్డులోని వేదవతి నిలయం అపార్ట్‌మెంట్‌కు సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రాంచందర్ పేర్కొన్నారు.
● 59వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీలో 4 చోట్ల కల్వర్టులు, కేఎల్‌ఎన్ రెడ్డి నగర్‌లో డ్రెయినేజీ నిర్మించాలని గుగ్గిళ్ల వసంత విన్నవించారు.
● 52వ డివిజన్ శంకర్‌నగర్ కాలనీ రోడ్డు నంబరు 6లో సీసీ రోడ్డు నిర్మించాలని, ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కాలనీవాసులు కోరారు.
● 11వ డివిజన్ కాపువాడలో ‘మిషన్’ పైపులైన్లు పునరుద్ధరించాలని బక్కి రాజ్‌కుమార్ కోరారు.
● 41వ డివిజన్ ఖిలా వరంగల్ శివారు శంభునిపేట విశ్వనాథ కాలనీ సర్వే నంబర్ 1135/ఏ స్థలంలో అక్రమంగా 1,210 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌పీఎస్ నాయకులు నమిండ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
కనీస వసతులు కల్పించాలని విన్నపాలు
బల్దియా గ్రీవెన్స్‌కు 117 దరఖాస్తులు
స్వీకరించిన కమిషనర్ చాహత్


