ముగిసిన తుది విడత ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో మూడో విడతలో 67 పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బులతోపాటు గిఫ్ట్‌లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తుండగా, ఆన్‌రిజర్వుడు, మేజర్ పంచాయతీల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మూడో దశలో మొత్తం 68 పంచాయతీలు, 634 వార్డులకు గాను ఒక గ్రామ పంచాయతీ, 71 వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 67 జీపీలు, 563 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 230 మంది, వార్డుల్లో 1,424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం మొత్తం 626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో జరిగే ఈ పోలింగ్‌లో 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.
వరంగల్‌జిల్లాలో నాలుగు మండలాల్లో..
వరంగల్: వరంగల్ జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. టీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విడత పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట, ఖానాపూరం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, ఇందులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 102 సర్పంచ్ స్థానాల కోసం 307 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 946 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 137 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 809 స్థానాల కోసం 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పల్లెల్లో పంపకాల జోరు
హనుమకొండ జిల్లాలో 67 జీపీలు, 563 వార్డులకు..
వరంగల్ జిల్లాలో 102 సర్పంచ్,
809 వార్డులకు ఎన్నికలు
ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
ముగిసిన తుది విడత ప్రచారం


