యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలి..
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని, గుర్తించిన యాచకులను స్మైల్ కేంద్రంలో చేర్పించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ భీమారంలో జీడబ్ల్యూఎంసీ, హెల్త్ కేర్ సొసైటీ ఎన్‌జీఓ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్రంలో యాచకులకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులను సర్వే చేసి, కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోంలో ఆశ్రయం కల్పించి, తదుపరి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్‌ఓ రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలి:
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా డెడ్‌లైన్ ఉందని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోమైనింగ్ పనులపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్వీపింగ్ మిషన్ల పనితీరు బాగాలేదని, ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంజినీర్లను కోరారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోశ్‌బాబు, మాధవీలత, ఏఈలు నరేశ్, సంతోశ్‌కుమార్ స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు.


