పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్, కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. త్వరలో జిల్లాలో నిర్వహించనున్న జేఈఈ (మెయిన్‌న్స్)–2026 పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జనవరి 21 నుంచి 30 వరకు (మొదటి సెషన్), ఏప్రిల్ 2 నుంచి 9 వరకు (రెండో సెషన్) జరిగే జేఈఈ (మెయిన్)– 2026 పరీక్షల కోసం జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించాలన్నారు. కమిటీ సభ్యులు డీసీపీ రవి, ఏసీపీ నర్సింహారావులు ఎన్‌టీఏ ద్వారా నామినేట్ చేయబడిన జిల్లా నోడల్ అధికారి, జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీమతి, డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్ సమన్వయంతో జిల్లాకు సంబంధించి ఎన్‌టీఏ అందించిన జాబితా ప్రకారం పరీక్ష కేంద్రాలను సందర్శించి సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్‌బ్యాక్ ఫారమ్ సమర్పించాలన్నారు.


