
రూ.3.25 కోట్లు!
● వరంగల్ జిల్లాలో రేషన్ డీలర్లకు
ప్రభుత్వాలు చెల్లించాల్సిన కమీషన్
● త్వరగా ఖాతాల్లో జమచేసి
ఆదుకోవాలని డీలర్ల విజ్ఞప్తి
సాక్షి, వరంగల్/నెక్కొండ: రేషన్ బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ రాకపోవడంతో షాపుల నిర్వహహణకు వారు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్లకు కేంద్రం నుంచి ఈ నెల అక్టోబర్‌తో కలుపుకుంటే ఆరు నెలల కమీషన్ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ కమీషన్ రావాల్సి ఉంది. జూన్‌లో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల బకాయిలకు తోడుగా మరో నాలుగు నెలల బకాయిలు చేరాయి. ఇలా మొత్తం కేంద్రం నుంచి ఏడు నెలల బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ఏప్రిల్‌కు సంబంధించి కేంద్రం నుంచి కమీషన్ రేషన్ డీలర్ల ఖాతాలో పడింది.
509 రేషన్ దుకాణాలు.. 2,82,674 మంది లబ్ధిదారులు
జిల్లాలో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2,82,674 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా నర్సంపేట, ఏనుమాముల, వర్ధన్నపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా షాపులకు లారీల ద్వారా వెళ్తున్నాయి. ఇలా నెలకు 5,382.518 మెట్రిక్ టన్నులు రేషన్ కార్డుదారులకు అందిస్తున్నారు. సుమారుగా ఒక్కో దుకాణంలో 100 నుంచి 120 క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. కిలోకు కేంద్రం నుంచి 90 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 పైసల కమీషన్ డీలర్లకు వస్తుంది. ఈ లెక్కన ఒక దుకాణానికి 100 క్వింటాళ్లు అనుకుంటే రూ.తొమ్మిది వేలు.. ఆరు నెలలకు సంబంధించి కేంద్రం నుంచి రూ.54,000 వరకు ఒక్కో డీలర్‌కు రావాల్సి ఉంది. అంటే ఆరు నెలలకు సుమారు రూ.2,74,86,000 కమిషన్ రూపంలో డీలర్ల ఖాతాలో జమ కావాల్సి ఉంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.50,90,000 డీలర్లకు బకాయి ఉంది. రూ.3,25,76,000 మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేయాల్సి రావడంతో హమాలీ, లేబర్, ఇతర ఖర్చులు మూడింతలయ్యాయి. ఈ మొత్తం ఖర్చు బయట నుంచి అప్పోసప్పో చేసి సొంతంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయిలు తొందరగా విడుదల చేయాలని డీలర్లు కోరుతున్నారు.