
నేటినుంచి కార్తీక మాసోత్సవం..
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నేటినుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు (బుధవారం) నుంచి నవంబర్ 20వ తేదీవరకు దేవాలయంలో కార్తీక మాసోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మంగళవారం దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ పీఎస్ సీఐ మచ్చ శివకుమార్, ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేష్‌బాబుతో కలిసి అనిల్‌కుమార్, ఉపేంద్రశర్మ ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ శివకుమార్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించుకునే మహిళా భక్తుల కోసం మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏమైనా ఇబ్బంది ఏర్పడితే డయల్–100కు కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. గట్టు మహేష్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా వస్తుంటారని అన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ దీపాలు వెలిగించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాయంత్రం ప్రదోషకాల పూజలు, చతుర్వేదసేవ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కాకతీయకాలనీ గురుద్వార్ ఆధ్యక్షుడు హరిసింగ్, విజయరాణి, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు.
కార్యక్రమాల వివరాలు..
అక్టోబర్ 22న (బుధవారం) కార్తీక శుద్ధపాడ్యమి ఉత్సవాలు ప్రారంభం.
25న శనివారం నాగులచవితి పూజలు.
27న సోమవారం కార్తీక ప్రథమ సోమవారం పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు.
నవంబర్ 3న కార్తీకమాస రెండో సోమవారం సామూహిక రుద్రాభిషేకాలు.
5న బుధవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, సాయంత్రం 6గంటల నుంచి లక్ష దీపోత్సవం.
10న కార్తీకమాస మూడో సోమవారం, 17న కార్తీకమాస నాలుగో సోమవారాల్లో ఉదయం 6గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు.
18న మంగళవారం మాసశివరాత్రి మకరలగ్నంలో ఉదయం 10:35 గంటలకు శ్రీ శివకల్యాణోత్సవం, రూ.1,116 చెల్లించాచి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు.
వేయిస్తంభాల దేవాలయంలో
అన్ని ఏర్పాట్లు పూర్తి