
‘సాస్కి’పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సమీక్షలో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్ : స్కీమ్స్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కి) పథకం అమలుకు నవంబర్ 30లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సాస్కి ప్రతిపాదనలపై ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సాస్కి పథకంపై అధికారులు వ్యూహాత్మక ప్రణాళికతో స్థలాలను గుర్తించి, తగిన డాక్యుమెంటేషన్‌తో అన్ని అంశాలను క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. నైబర్ హుడ్ ప్రణాళిక అంశంలో పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్పాంజ్ సిటీ కాన్సెప్ట్‌లో భాగంగా నగరంలో స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేయడం, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. సిటీ గ్రీన్‌లో భాగంగా 50 ఎకరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం తో పాటు పురాతన బావులను పునరుద్ధరించే అంశాలను పొందుపరచాలని మేయర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ శివానంద్, ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.