
ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయిక్
వరంగల్: ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని ఏఐసీసీ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుకొండలోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకుపోయి డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తామని వెల్లడించారు. వరంగల్ జిల్లాలో అంతర్గత కుమ్ములాటపై స్పందించాలని విలేకరులు అడిగారు. కేవలం డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం పరిశీలికుడిగా వచ్చానని, పార్టీ అంతర్గత విషయాలపై తాను మాట్లాడనని, అయితే ఇక్కడ పరిస్థితులను మాత్రం పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని నవజ్యోతి పట్నాయక్ సమాధానం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. సోమవారం మేడారం పర్యటనకు ఎందుకు గైర్హాజరయ్యారని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ మంత్రిగా తనకు పనులు ఉండడంతోనే మేడారం పోలేదని, ఇలాంటి విషయాలపై కామెంట్ చేయనని అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, ఆదర్శ్, జైస్వాల్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, గుండేటి నరేంద్రకుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కురుమి పరమేశ్, పీసీసీ నాయకులు వరదరాజేశ్వర్‌రావు, నవీన్‌రాజ్, అయూబ్‌ఖాన్, మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, గోరంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.