
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం
దూరవిద్యలో కోర్సుకు యూజీసీ నిరాకరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్‌మోడ్‌లో, ఆన్‌లైన్ మోడ్‌లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు.
డిమాండ్ ఉన్న కోర్సు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. సుమారు 21 ఏళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది.
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్‌లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్‌లైన్ మోడల్‌లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం.
దూరవిద్యలో 2024–25 బ్యాచ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది.
– వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్
డీఎల్, ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించొద్దు
యూనివర్సిటీలకు లేఖలు
ఇప్పటికే అడ్మిషన్లు పొందిన
విద్యార్థులకు ఫీజు రీఫండ్
గత విద్యా సంవత్సర విద్యార్థులకు యథావిధిగా..