
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించాలని కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్‌ఆఫ్‌వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్‌టెన్నిస్, బీచ్‌వాలీబాల్, తంగ్‌తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్‌బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్ట్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్‌బాల్, లాన్‌టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్‌తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో రాకేశ్‌రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 200 పాఠశాలల్లో రూ.180 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 80 నుంచి 200కు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెంచి, 8 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదన్నారు. సమస్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించి బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు.
కాళోజీ సెంటర్: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశానికి సంబంధించిన కార్యక్రమంపై ఈనెల 14, 15, 16 తేదీల్లో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గణితం ఉపాధ్యాయులు ప్రభుత్వ, స్థానిక సంస్థల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు వీలైతే సొంత లాప్‌టాప్, ట్యాబ్ లేదా ఇటీవల విద్యాశాఖ అందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ ఆర్‌ని వెంట తెచ్చుకోవాలని సూచించారు.