
నిబద్ధత కలిగిన వారికే డీసీసీ పీఠం
హన్మకొండ చౌరస్తా: నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగిన వారికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పీఠం దక్కుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నాయక్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల భర్తీ కార్యక్రమంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంఘటన శ్రీయన్ అభియాన్ పార్టీ పునఃనిర్మాణానికి మొదటి అడుగు పడిందన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం డీసీసీ భవన్‌లో హనుమకొండ జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్‌జైస్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, వెంకట్‌రెడ్డి, శ్రవణ్, సాగరిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్