
అత్యంత వైభవంగా నరకాసుర వధ
మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మంత్రి స్వగృహంలో మంత్రి కొండా సురేఖను నరకాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మరుపల్లి రవి కలిసి ఏర్పాట్లపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపావళి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌కు చెబు తానని ఆమె పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉన్నారు
హన్మకొండ కల్చరల్: రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన ‘పుంజు తోక’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో జరగనున్నట్లు మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి పుస్తక పరిచయం చేస్తారని తెలిపారు. జిల్లా సాహితీవేత్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నేడు ‘ఆరెపల్లి మట్టిబిడ్డలు’ పుస్తకావిష్కరణ
నయీంనగర్: నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆరెపల్లి గ్రామం సరళి అధ్యయన కేంద్రంలో ‘మట్టిబిడ్డల మావూరి యధార్థ జీవిత కథలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుస్తక రచయిత, జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టిబిడ్డల పుస్తకాన్ని సాహితీవేత్త, మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్–సుధ దంపతులకు అంకితమిచ్చి నట్లు తెలిపారు. కవులు, సాహితీమిత్రులు పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభకు రావాలని కోరారు. కార్యక్రమంలో రాకేశ్, రఘువీర్, దినేశ్, గోపాల్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఏ బుక్ ఆఫ్ ఆన్ డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు జిల్లాలోని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల్లో డిజిటల్ లెర్నింగ్, కోడింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, 21వ శతాబ్ద నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిక్షణ ఉపయోగడనుందని డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. ఈనెల 13న ఉదయం 9గంటలకు ల్యాప్‌టాప్‌లతో, 6 నుంచి 9వ తరగతి డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. మూడు రోజులపాటు శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారని వారు తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 16, 18, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.