
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించండి
వరంగల్ అర్బన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంఏవై– అర్బన్–2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్–25 పోస్టర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. పీఎంఏవై–అర్బన్ 2.0 పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పేద, బలహీన వర్గాలకు మేలు జరిగేలా చూడడంతో పాటు, రుణ మేళాల ద్వారా లబ్ధిదారులకు గృహ రుణాలు అందేలా చూడాలని కమిషనర్ కోరారు. సమవేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు గణపతి, హరికృష్ణ, బల్దియా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, హౌసింగ్ బోర్డు ప్రత్యేకాధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.