
బ్రోకర్ మాటల్లో నేర్పరి సీఎం రేవంత్
హన్మకొండ: బ్రోకర్ మాటలు మాట్లాడడంలో సీఎం రేవంత్ రెడ్డి నేర్పరి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధ్యం కాదని జీఓ–9 తీసుసుకువచ్చి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మాటలతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారని విమర్శించారు. యూరియా కొరతతో ప్రజలు కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తరిమి కొట్టే పరిస్థితి నెలకొందని, దీంతోపాటు హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి వారి దృష్టి మళ్లించేందుకు బీసీ రిజర్వేషన్ల డ్రామాను ముందుకు తీసుకువచ్చాడని దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో 55 ఏళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఇవ్వాలని అనడం నేరమని, అడిగిన వారిని జైల్లో పెట్టాలని గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ ఒక్క మీటింగ్ పెట్టలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేదని, దీన్ని బట్టి వీరికి ఎన్నికలు జరగవని ముందే తెలుసని అర్థమవుతుందన్నారు. బీసీలను సీఎం రేవంత్, కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాలని, తాము కూడా మద్దతుగా వస్తామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ బాకీ కార్డులను ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, శంకర్ నాయక్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయకులు జోరిక రమేష్, చింతల యాదగిరి, చల్ల వెంకటేశ్వర్ రెడ్డి, బండి రజనీకుమార్, రామ్మూర్తి, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు