
బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్ర
నయీంనగర్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ–9పై హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో శుక్రవారం కేయూ జంక్షన్‌లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అనంతరం జీఓ–9కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు, హై కోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరీ రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకొని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఆమోదం ఉంటే బీసీ రిజర్వేషన్లకు కోర్టులో స్టే వచ్చేది కాదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ.. బీసీలను తప్పు దోవ పట్టిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన స్టే అగ్రవర్ణాల కుట్ర అని అన్నారు. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. రెడ్డి కులస్తులంతా బీసీ వ్యతిరేకులేనని, బీసీ సమాజమంతా రెడ్డి కులస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి పిటిషన్లు అధర్మమని, బీసీ రిజర్వేషన్లు ధర్మమన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిరసనలో నాయకులు సాయిని నరేందర్, కందికొండ వేణుగోపాల్, బోనగాని యాదగిరి గౌడ్, తాడిశెట్టి క్రాంతి, గడ్డం భాస్కర్, బచ్చు ఆనందం, వైద్యం రాజగోపాల్, దాడి మల్లయ్య యాదవ్, పద్మజాదేవి, శోభారాణి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో
రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం