
రైల్వే కార్మికులకు మెరుగైన వైద్యం
కాజీపేట రూరల్ /డోర్నకల్ : రైల్వే కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రైల్వే శాఖ నిరంతరం కృషి చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ (పీసీఎండీ) డాక్టర్ నిర్మలారాజారాం అన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రిని శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ నారాయణస్వామితో కలిసి వారు సందర్శించి తనిఖీ చేశారు.అలాగే సకల వసతులతో డోర్నకల్‌లో పునః నిర్మించిన రైల్వే ఆస్పత్రిని డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణణ్, డీఆర్‌యూసీసీ సభ్యులు ఖాదర్, రైల్వే చీఫ్ మెడికల్ సూపరిండెంటెంట్ నారాయణ స్వామి, రైల్వే ఆస్పత్రి డాక్టర్ సునీల్ కుమార్ కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే ఆస్పత్రి నుంచి కార్మికులకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలో మూడు రెఫరల్ ఆస్పత్రుల నుంచి వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏకశిల ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్ డెమోను డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ నిర్వహించగా ఆమె అభినందించారు. రైల్వే ఆస్పత్రి హాల్‌లో డాక్టర్లు నిరంజన్‌రావు, నరేందర్ హిర్వాని, యాకూబ్, దీరజ్, హరిబాబులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్క నాటారు.
రైల్వే నాయకుల వినతులు
కాజీపేట రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన డాక్టర్ నిర్మలారాజారాంకు రైల్వే మజ్దూర్ యూనియన్ అన్ని బ్రాంచీల కోఆర్డినేటర్ నాయిని సదానందం, రైల్వే సంఘ్ సీడబ్ల్యూఎస్సీ మెంబర్ సాదినేని వెంకటనారాయణ, ఎస్సీ,ఎస్టీ నాయకులు బి.వీరన్న, కెఎన్.రావు, ఆర్.కుమార్, బి.జక్రియ ఆధ్వర్యంలో వైద్య సమస్యలను పరిష్కరించి, ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలని వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు.
దక్షిణ మధ్య రైల్వే పీసీఎండీ
డాక్టర్ నిర్మలారాజారాం