
అభివృద్ధిపై మంత్రి సమీక్ష
హన్మకొండ అర్బన్: ప్రజా పాలన వేడుకల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సుమారు గంటసేపు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, మేయర్, గ్రేటర్ కమిషనర్, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ అంతర్గత విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అంతకుముందు ప్రజాపాలన వేడుకల కోసం నగరానికి వచ్చిన మంత్రి పొంగులేటికి నిట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
అమరవీరులకు నివాళి..
హనుమకొండ అదాలత్ కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.