
ఇందిరమ్మ రాజ్యంలోసామాజిక న్యాయం
వరంగల్ అర్బన్: తెలంగాణ సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఓ సిటీ ఎదుట ఉన్న ఐడీఓసీ మైదానంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజున ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహించడం శుభసూచకమన్నారు. స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశంలో రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైన చర్యలతో భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించిందని చెప్పారు.
ప్రజలకు సమాన అవకాశాలు..
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల మనస్సును గెలుచుకుందని తెలిపారు. ప్రజలందరికీ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు ప్రభుత్వం పయనిస్తోందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచడం తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యరాణి, డీఆర్వో విజయలక్ష్మి, సీఈఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు
ప్రజల మనస్సును గెలిచిన కాంగ్రెస్ సర్కారు
ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ

ఇందిరమ్మ రాజ్యంలోసామాజిక న్యాయం

ఇందిరమ్మ రాజ్యంలోసామాజిక న్యాయం