
రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఎందుకు తొలగించారో జవాబు చెప్పాలని అన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించి తాము ఏ అక్రమాలకు పాల్పడలేదని ముక్కునేలకు రాయాలని హరీశ్‌రావు, కేటీఆర్‌కు సవాల్ విసిరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్న హరీశ్‌రావు, కేటీఆర్.. దమ్ముంటే మీరందరూ రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, పింగిళి వెంకట్‌రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, మార్క విజయ్ పాల్గొన్నారు.