
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు.
హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ’సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్‌లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు
గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్‌ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్‌ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి.
ఆగస్టులో 15 కేసులు..
కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, గీసుకొండ, హసన్‌పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌ఎంసీ చట్టం 34, 54 (టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఎన్‌ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మచ్చుకు కొన్ని ఘటనలు..
● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై ఇంతేజార్‌గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్‌ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు.
● గతేడాది అక్టోబర్‌లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.
● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
జాయింట్ తనిఖీలతో ఫలితాలు
నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్‌ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్‌లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్‌ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు.
– డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ
పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్‌లు, ల్యాబ్‌లు
యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు
తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్‌మెంట్
వైద్యం వికటించి పలువురికి అస్వస్థత
పోలీసు కేసులకు వెరవని కొందరు

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!