●ఎల్లంపేటలో గృహోపకరణాలు దగ్ధం..
మరిపెడ రూరల్ : ఒకే ఇంటిపై మూడుసార్లు పిడుగులు పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగూరి వెంకన్న, వెంకటమ్మ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వారి భవనం మెట్లపై ఒక చోట, డాబాపై రెండు చోట్ల పిడుగు పడింది. భయంతో వణికిపోయిన దంపతులు పక్కింట్లో తలదాచుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వెంకటమ్మను ఆస్పత్రికి తరలించారు. పిడుగులు పడి స్లాబుకు పెచ్చులూడి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫ్రిడ్జి, ఫ్యాన్లు, టీవీ, విద్యుత్ తీగలు కాలిపోయాయి. మొత్తం రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలాన్ని శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి గణేశ్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేశ్‌తో పాటు గ్రామస్తులు కోరారు.
ఒకే ఇంటిపై మూడు పిడుగులు