
గొర్రెల మందపై పిడుగు..
కాళేశ్వరం : గొర్రెల మందపై పిడుగు పడి 94 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, గొర్రెల కాపరులు తెలిపిన కథనం ప్రకారం.. అంబటిపల్లికి చెందిన సుమారు ఆరు గొర్రెల మందలు పెద్దంపేట–లెంకలగడ్డ గ్రామ శివారులో మేతకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాపరులు మంద నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న గుడారంలోకి వెళ్లారు. మందపై ఒక్కసారి పిడుగు పడడంతో గొర్రెలన్నీ ఎక్కడిక్కడ చెల్లా చెదురయ్యాయి. రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృతిచెందడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల పశువైద్యాధికారి రాజబాపు, తహసీల్దార్ రామారావు చనిపోయిన గొర్రెలకు పంచనామా, పోస్టుమార్టం చేశారు. గోతితీసి పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు.