
శభాష్.. ఎల్కతుర్తి పోలీస్
ఎల్కతుర్తి : వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఖాకీలు కాపాడారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గాజుల రాకేశ్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో రాకేశ్ కొట్టుకుపోయి బ్రిడ్జి వద్ద ఉన్న మూడో పిల్లర్‌ను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్–100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ వెంటనే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాడుసాయంతో రాకేశ్‌ను రక్షించారు. దీంతో పోలీసులను ప్రజలు అభినందించారు. కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.