
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని జిల్లా వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌కి మెమో
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లోని మండల్ లెవల్ స్టాక్(బియ్యం) పాయింట్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితర అధికారులు పాల్గొన్నారు.
నిర్వాసితులతో కలెక్టర్ సమీక్ష
మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్‌డిఓ సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్ తహాశీల్‌దార్ శ్రీకాంత్, ఏఓ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.