
16న జాబ్‌మేళా
న్యూశాయంపేట: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీలో రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. వివరాలకు 80790 09659లో నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
బిట్ కాయిన్ ట్రేడింగ్
పేరుతో సైబర్ మోసం
మహబూబాబాద్ రూరల్ : బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం జరగగా ఓ బాధితుడు రూ.32.53 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్‌కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా షాదీడాట్ కామ్ అని మెసేజ్ చేసి వివరాలు అడిగారు. బాధితుడికి వివాహమైందని తెలియజేసి వారికి వివరాలు ఇవ్వలేదు. కొన్నిరోజుల తర్వాత అదే వాట్సాప్ నంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్పి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికి లింక్ పంపించారు. ఆ లింక్‌తో బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాళ్లు చెప్పిన విధంగా మొదటగా రూ.50వేలు, ఆ తర్వాత రూ.5లక్షలు పంపించాడు. అయితే బాధితుడి వాలెట్‌లో రూ.పది లక్షలు ఉన్నట్టు చూపించి నమ్మించారు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వాళ్లు చెప్పినట్లు వివిధ ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించాడు. తర్వాత ఎలాంటి నగదు బాధితుడి అకౌంట్‌లో జమకాలేదు. అయినా కూడా డబ్బులు జమ చేయకుండా మరింతా డబ్బులు అడుగుతుండటంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
● రూ.32.53లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
● కేసు నమోదు చేసిన పోలీసులు