
ప్రభుత్వ బడిలో కార్పొరేట్ విద్య
హసన్‌పర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. దాతలు (అరబిందో ఫార్మా ఫౌండేషన్, బ్రెల్‌చివ్ టర్నాలజీ, స్వాన్ టర్బిన్ సర్వీస్) సహకారంతో హసన్‌పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో సుమారు రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ఆడిటోరియంలో ఫర్నిచర్‌ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. హసన్‌పర్తికి చెందిన ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేదరికాన్ని జయించి ఐపీఎస్‌గా ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీపరీక్షలకు సంబంధించిన సుమారు రూ.8లక్షల విలువైన మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. దాతలు స్వాన్ టర్బిన్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ, బ్రెల్‌చివ్ టర్నాలజీ సీఈఓ డాక్టర్ ఉదయ్‌కుమార్, మహర్షి ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నూరి రవిని శాలువాలతో సత్కరించారు. డీఐఈఓ గోపాల్, ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
దాతల సాయంతో హసన్‌పర్తి కళాశాల, పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో ఆడిటోరియం, ల్యాబ్ ప్రారంభం