
సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’
డోర్నకల్ : రైలులోని ఓ బోగీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో మూడు గంటలకు పైగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట దాటిన తర్వాత రైలులోని డీ–2 బోగీలో సాంకేతిక లోపం తలెత్తింది. వరంగల్ స్టేషన్‌లో బోగీలోకి ఎస్కార్ట్‌గా ఎక్కిన సిబ్బంది రైలు ఆగిన ప్రతీ స్టేషన్‌లో డీ–2 బోగీని పరిశీలించారు. రైలు మహబూబాబాద్ దాటిన తర్వాత డీ–2 బోగీలో హార్డ్ యాక్సిల్ బేరింగ్ దెబ్బతిందని సిబ్బంది డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు. డోర్నకల్ స్టేషన్‌లో సీఅండ్ డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు సాయంత్రం 5:04 గంటలకు డోర్నకల్ స్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫామ్ చేరుకున్న తర్వాత డీ–2 బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసి రైలు నుంచి తొలగించాలని నిర్ధారించారు. రైలు వెనుకవైపు ఇంజన్ అమర్చి బీ–2 వరకు చివరి ఐదు బోగీలను జంక్షన్‌లోని యార్డుకు తరలించారు. డీ–2 బోగీని యార్డులో వదిలి మిగతా నాలుగు బోగీలను తిరిగి రైలుకు అమర్చిన తర్వాత రైలు రాత్రి 8:13 గంటలకు డోర్నకల్ నుంచి కదిలింది. సుమారు మూడు గంటలకు పైగా స్టేషన్‌లో రైలు నిలవడంతో విజయవాడ, గుంటూరు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.

సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’