
ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎంలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్స్‌లు
ఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు వరంగల్ కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తమదెన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్‌ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యుల్లో, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది.
వినతులు బహిర్గతం చేయాలి..
ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్‌లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్‌ను పది రోజులకోసారి తెరుస్తూ కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు.
వేటు.. మెమోలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్‌లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కిశోర్‌ను ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు.
మరికొన్ని బాక్స్‌లు ఏర్పాటు చేయాలి..
ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్‌లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్నీ సత్ఫలితాలు ఉంటాయని రోగులు వేడుకుంటున్నారు.
నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు
నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు
జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది
ఓపీ విభాగంతోపాటు మరిన్ని
ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వినతి
ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నాలు

ప్రక్షాళన ఇట్టే!