
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
హసన్‌పర్తి: ప్రభుత్వ భూమికే ఓ ప్రబుద్ధుడు ఎసరుపెట్టాడు. డాక్యుమెంట్లతో స్థలాన్ని కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు. వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నంబర్ 516లో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 400 ఎకరాల మేరకు అసైన్డ్ చేశారు. మిగిలిన భూమి పడావుగా ఉంది. అదే గ్రామానికి చెందిన రాజమౌళి కన్ను ప్రభుత్వ స్థలంపై పడింది. దీంతో మూడు డాక్యుమెంట్లు తయారుచేసి ఆ భూమి కబ్జా చేశాడు. ఆ ఇంటి నంబర్‌తో తన కుమారుడు, కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. కబ్జా చేసుకున్న భూమిని పట్టాగా నమ్మించాడు. అందులో కుమారులు, కూతుళ్ల పేర్లపై నిర్మాణాలు చేపట్టాడు. ఈ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు ఇంటి నంబర్లు కూడా జారీ చేశారు. కాగా, ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందని స్థానిక ఓ యువకుడు అధికారులను ఆశ్రయించాడు. ఫలితం లేకపోవడంతో కార్పొరేషన్, రెవెన్యూ అధికారులను కక్షిదారులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు సూచనల మేరకు అధికారులు సర్వే చేసి ఆ భూమి ప్రభుత్వానిదని నిర్ధారించి కమిషనర్‌కు నివేదిక అందించారు. ఈమేరకు వారం రోజుల క్రితం కబ్జాదారుడికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మూడు ఇళ్లు సీజ్ చేశారు. ఈక్రమంలో కబ్జాదారుడి బంధువులు, స్నేహితుల నుంచి కొంత అవాంతరం ఎదురైంది. అప్పటి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమి జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ఇక్కడ వీఆర్‌ఓగా పనిచేసిన వ్యక్తి కబ్జాదారుడికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైకోర్టును ఆశ్రయించిన స్థానికుడు
కోర్టు ఆదేశంతో మూడు ఇళ్లు సీజ్