
తల్లిదండ్రులకు భారమైన శిశువు మృతదేహం
● ఎంజీఎం మార్చురీలో వదిలేసిన కన్నవారు
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఎంజీఎం: ఎంజీఎం మార్చురీలో ఓ పసికందు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన హైమవతి–అనిల్ దంపతులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైమావతి 7 నెలల గర్భిణి. కాగా, ఇటీవల తొర్రూరు ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఎంజీఎంలోని నవజాత శిశు కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా ఈనెల 8వ తేదీన మృతి చెందింది. కాగా, పసికందు మృతదేహాన్ని తల్లిదండ్రులు మార్చురీలో వదిలివెళ్లారా, డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు అని వదిలివెళ్లారో తెలియదు. కానీ, గురువారం సాయంత్రం ఆస్పత్రిలో ఈ విషయం చర్చకు దారితీసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు మార్చురీలో ఉన్న పసికందు మృతదేహం గురించి సదరు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు మరోసారి ఎంజీఎం మార్చురీకి రానున్నట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.