
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన
హన్మకొండ అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నినాదాలతో హోరెత్తిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్ గేట్‌ను తోసుకుని, గేట్లు ఎక్కి లోపలికి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగింది. ఈసందర్భంగా ఏబీవీపీ వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థులు గుర్తుకొస్తారని ఆరోపించారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ దూళిపూడి హరిచరణ్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్, రోహిత్, రాహుల్, నవీన్, త్రినేష్, అభిలాష్, శ్రీశాంత్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడికి యత్నం
సీఎంను విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్
విడుదల చేయాలని ధర్నా

ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన