
విద్యుదాఘాతంతో కార్మికుడికి గాయాలు
● సీపీఆర్ చేసి కాపాడిన రౖడైవర్
హన్మకొండ అర్బన్: విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు గాయపడిన సంఘటన గ్రేటర్ 49వ డివిజన్ పరిధిలోని దర్గా వంద ఫీట్ల రోడ్డులో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దర్గా వందఫీట్ల రోడ్డులో ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఎదుట నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తులో మాలోత్ సారయ్య సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్ లైన్‌కు ఇనుపరాడు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండో అంతస్తుపై నుంచి కింద పడిపోయాడు. కుప్పకూలిన సారయ్య మరణించాడని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన స్థానిక ఎకై ్సజ్ ఆఫీస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సాంబరాజు ధైర్యంగా ముందుకు వచ్చి సారయ్యకు సీపీఆర్ చేశాడు. దీంతో కొద్దిసేపటికి సారయ్యకు స్పృహ వచ్చింది. ఆర్‌ఈసీ ఎన్పీడీసీఎల్ ఏ ఈ, లైన్‌ఇన్‌స్పెక్టర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భవన నిర్మాణ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోని ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని యజమానిని అదేశించారు. బాధితుడికి ఒక కాలు విరిగిపోవడంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. 108 పైలట్ బాలాజీ, ఈఎంటీ సురేందర్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేసిన డ్రైవర్ సాంబరాజును స్థానికులు అభినందించారు.