
బైక్.. భద్రం!
ఖిలా వరంగల్: వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను భద్రంగా చూసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దు. అప్పుడే బైక్‌లు కొద్దికాలంపాటు మన్నికగా ఉంటాయి. ఇలా కాకుండా నిర్లక్ష్యంగా నడిపితే వాహనాలు మరమ్మతులకు గురవుతాయి. అప్పుడు కనీసం రూ.2వేలు చేతిలో ఉండాల్సిందే. ఇంజన్ పాడైతే రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అదనపు భారం పడే అవకాశముంది. ఒక్కసారిగా ఇంత ఖర్చు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. కనీస జాగ్రత్తలు పాటిస్తే వాహనాలు మన్నికగా ఉంటాయని సీనియర్ మెకానిక్ అంకాల సతీశ్ చెబుతున్నారు.
బైక్‌ల నిర్వహణ గాలికి..
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.20వేలకు పైగా కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన చాలా మంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మరమ్మతులకు గురవడంతో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
నిర్లక్ష్యంగా
ఎక్కడపడితే అక్కడే పార్క్..
వర్షం కురుస్తున్న సమయంలో పలువురు తమ వాహనాలను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఆపుతారు. దీంతోపాటు వాహనాన్ని రహదారులపై మె కాలి లోతులో నిలిచిన నీటి నుంచి నడుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల పలు భాగాల్లోకి నీరు చేరి బైక్ మొరాయిస్తుంది. లాక్ సిస్టమ్, ప్లగ్, కేబుళ్లు, బ్రేకులు, ఇంజన్, ఫైరింగ్ సిస్టమ్.. ఇలా వాహనంలో ప్రతీ వస్తువు పాడయ్యే అవకాశముంది.
వాహనం నీటిలో నానితే
బ్రేక్ సిస్టమ్‌పై ప్రభావం..
వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. మరో వైపు ప్రతీ వాహనదారుడు తమ వాహనానికి సంబంఽధించి టైర్లు, బ్రేకులు బాగున్నాయా..? లేవా..? అని తనిఖీ చేయాలి. దీంతోపాటే చైన్‌ను కూడా లూబ్రికేషన్ చేయించాలి. తడిస్తే తుప్పు పడుతుంది. ఈనేపథ్యంలో చైన్ లూబ్రికేంట్‌ను వాడడం మంచిది. వర్షాకాలంలో తడి, నీళ్ల రోడ్లపై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మొదట వాహన టైర్లును తనిఖీ చేయాలి. అరిగిపోయి ఉంటే వాటిని మార్చుకోవాలి. బ్యాటరీ పూర్తిగా చార్జీంగ్ చేసి మంచి స్థితిలోఉందో.. లేదో చూసుకోవాలి. వర్షానికి వాహనం తడిస్తే ఆ ప్రఽభావం పలు భాగాలపై పడుతుంది. విజిబిలిటీ బాగుండాలంటే బ్యాటరీ ఫుల్‌గా ఉండాలి. బల్బుపోతే వెంటనే మార్చుకోవాలి.
బైక్‌ను భద్రంగా
కాపాడుకోవాలి..
వర్షం కురుస్తున్న సమయంలో బైక్‌పై ప్రయాణం ప్రమాదకరం. బ్రేక్‌లు, క్లచ్‌లు పనిచేయక బైక్ అదుపు తప్పి ప్రమాదం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తే సైలెన్సర్ ద్వారా ఇంజిన్‌లోకి వరదనీరు చేరి బైక్ పాడవుతుంది. తద్వారా మరమ్మతుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వర్షాకాంలో బైక్‌ను భద్రంగా కాపాడుకోవాలి.
అంకాల సతీశ్,
సీనియర్ బైక్ మెకానిక్
వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి
ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మెకానిక్ షెడ్‌కు వెళ్లాల్సిందే
మరమ్మతుకు చేతిలో వేలాది రూపాయలు ఉండాల్సిందే..
వర్షపు నీటిలో ప్రయాణించొద్దని మెకానిక్‌ల సూచన

బైక్.. భద్రం!