
బిల్లింగ్‌లో మానవ రహిత సేవలు
హన్మకొండ: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ టీజీ ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతీవిభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ సేవల్లో కచ్చితత్వాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్‌టీ మీటర్ రీడింగ్ నమోదులో ఆధునిక సాంకేతికతను చొప్పిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా మీటర్ రీడింగ్ నమోదు చేసే పరికరాన్ని అమరుస్తున్నారు. ఇప్పటివరకు హెచ్‌టీ సర్వీస్‌ల స్థాయిలను బట్టి ఏడీఈ, ఏఈలు వెళ్లి మీటర్ రీడింగ్ నమోదు చేసేవారు. విద్యుత్ వాడుకునే కేటగిరీ వారీగా 55 హెచ్‌పీకి మించిన సామర్థ్యం ఉన్న మీటర్ల రీడింగ్‌ను ఏడీఈలు, 55 హెచ్‌పీలోపు ఉన్న సర్వీస్‌ల మీటర్ రీడింగ్‌లను ఏఈలు, నాన్ స్లాబ్ రీడింగ్‌ను లైన్ ఇన్‌స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్‌ను జేఎల్‌ఎంలు తీస్తున్నారు. వీరు హెచ్‌టీ మీటర్లను సందర్శించి వాటి రీడింగ్ తీసుకువచ్చి కార్యాలయాల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి విద్యుత్ వినియోగదారులకు బిల్లులు పంపేవారు. దీంతో సమయం వృథా అయ్యేది. లోపాలు తలెత్తేవి. వీటిని అధిగమించి కచ్చితత్వంతో బిల్లులు అందించేందుకు అటోమేటిక్ మీటర్ రీడింగ్ సిస్టంను అమలు చేస్తున్నారు.
ఆటోమేటిక్ మీటర్ రీడింగ్‌కు మోడెంల ఏర్పాటు..
హెచ్‌టీ సర్వీస్ మీటర్‌లతోపాటు, ఎల్‌టీలోనూ హెచ్‌టీ మీటర్లు వినియోగిస్తున్న సర్వీస్‌ల్లో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడమ్‌ను బిగిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి సర్కిల్‌లో పనులు జరుగుతున్నాయి. హెచ్‌టీ మీటర్లకు అమర్చుతున్న మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వస్తుందని అధికారులు తెలిపారు. మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుంది. దీంతో పొరపాట్లకు తావుండదు. జీఎస్‌ఎం/జీపీఆర్‌ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోడెంను హెచ్‌టీ మీటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వినియోగమైన యూనిట్ల వివరాలను కచ్చితత్వంతో కార్పొరేట్ కార్యాలయానికి చేరవేస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్‌లో మొత్తం హెచ్‌టీ మీటర్లు 4,013, ఎల్‌టీ సర్వీస్‌ల్లో హెచ్‌టీ మీటర్లు 2,254 ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1,650 మీటర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడెంలను అమర్చారు.
హెచ్‌టీ మీటర్‌లో
ఆటోమేటిక్ మీటర్ రీడింగ్
సులువుగా హెచ్‌టీ సర్సీస్‌ల బిల్లింగ్
మోడెంలు బిగిస్తున్న ఎన్పీడీసీఎల్
మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం,
సరఫరా సమాచారం వెంట వెంటనే చేరవేత