
ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలి
హన్మకొండ: చాకలి ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలని ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్ అన్నారు. నక్కలగుట్టలోని హోటల్ హరితకాకతీయలో చాకలి ఐలమ్మ వర్ధంతి, మహిళా చైతన్య సదస్సు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి సుందర్‌రాజ్ యాదవ్, అతిథులు, మహిళలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. భూమి.. భుక్తి.. వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మందిలో 80 శాతం మంది బీసీలేనన్నారు. అయినా ప్రభుత్వ పాలసీల్లో బీసీల ఊసేలేదని లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు. 51 మందిలో 26 సీట్లు బీసీ మహిళలు సాధించేలా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడంతో బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, మహిళా ప్రతినిధులు దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి, ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి, ఎంఎన్ మూర్తి, వేణుమాధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, పద్మజ, ప్రవళ్లిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు.
ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి
సుందర్‌రాజ్ యాదవ్