
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
తొర్రూరు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో బుధవారం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్‌ను కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ బిల్లు వరకు బీజేపీ బీసీలను మోసగిస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని, కేంద్రం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టి అమలు చేస్తుందా లేదా చెప్పడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై త్వరలో సింహగర్జన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్ మల్లేశ్వర్, నాయకులు గుండగాని వేణు, గట్టు ప్రభాకర్, పెదగాని సోమయ్య, మురళి యాదవ్, భిక్షంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్