
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమార్తె
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం భర్తతో కలిసి కుమార్తె.. తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జనగామ జి ల్లా పాలకుర్తి మండలం పెద్దతండా (కే) గ్రామంలో జరిగింది. సీ ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకా రం.. పెద్దతండా(కే)కు చెందిన బాదావత్ లక్ష్మి (42) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతి 15 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు సంగీత ఏకై క సంతానం. ఈమెకు ఐదేళ్ల క్రితం ఇదే మండలంలోని దుబ్బతండా(ఎస్‌పీ) గ్రామానికి చెందిన బానోత్ వీరన్నతో వివాహం చేశారు. తల్లి పేరిట ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమి తన పేరుతో పట్టా చేయాలని సంగీత పలుమార్లు అడిగింది. ఇందుకు తల్లి నిరాకరించింది. దీంతో ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు తల్లిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని భర్తతో చర్చించింది. ఇరువురు హత్య చేయాలని నిర్ణయం తీసుకొని మంగళవారం రాత్రి పెద్దతండాకు చేరుకున్నారు. కూతురు సంగీత, అల్లుడు వీరన్న కలిసి నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుపెట్టి హత్య చేశారు. కూలి పని కోసం పిలవడానికి వెళ్లిన స్థానిక మహిళ చూసి తండావాసులకు బుధవారం తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకీరాంరెడ్డి తెలిపారు.
పాలకుర్తి మండలం పెద్దతండా (కే)లో దారుణం