నిషేధం నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

నిషేధం నిర్వీర్యం

Sep 11 2025 2:20 AM | Updated on Sep 11 2025 10:30 AM

Plastic Covers

ప్లాస్టిక్‌ కవర్లు

నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ విక్రయాలు

బహిరంగంగా హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారం

మొక్కుబడి దాడులు.. మామూళ్లతో సరి

అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

వరంగల్‌ అర్బన్‌: మహా నగరంలో ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల నిషేధం వ్యాపారులకు మాత్రమే కాదు.. బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. నిషేధిత ప్లాస్టిక్‌ను ఆసరాగా చేసుకుని కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు ఎక్కడికక్కడ మామూళ్ల ఒప్పందంతో కాలం వెళ్లదీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు వినియోగించిన ప్రజలు అనారోగ్యం పాలవుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు.

కాసుల పంట..

ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దశాబ్ద కాలంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి విపత్తుగా మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల వినియోగం తగ్గి పేపర్‌, నార సంచుల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, ఇది క్షేత్రస్థాయిలో అమలుకు సాధ్యం కాకపోవడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.

రూ.50 వేల వరకు జరిమానా..

చిరువ్యాపారుల నుంచి హోల్‌సేల్‌ ప్లాస్టిక్‌ అమ్మకందారుల వరకు బల్దియా అధికారులు తనిఖీ చేసి రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే స్థాయి ఉంది. అధికారుల తనిఖీల్లేవు, సిబ్బంది పర్యవేక్షణ లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లను హోల్‌సేల్‌ వ్యాపారులు బహిరంగంగా అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చిన్న దుకాణం నుంచి భారీ హోల్‌సేల్‌ దుకాణం నుంచి నెలవారీ మామూళ్లు అందిస్తున్నామంటూ బహిరంగంగా వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన అధికారులు, సిబ్బంది కన్నెత్తి చూడకపోగా.. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మాత్రం గుట్టుచప్పడు కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

ప్లాస్టిక్‌ నిషేధం పేరిట స్పెషల్‌ డ్రైవ్‌ అంటూ పారిశుద్ధ్య కార్మికులతో బృందాలు ఏర్పాటు చేసి టిఫిన్‌ సెంటర్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, కూరగాయల, మాంసం దుకాణాల్లో మొక్కుబడిగా దాడులు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌పై పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లు ఉంది బల్దియా శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పనితీరు. ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు అమ్ముతున్న బడా వ్యాపార సంస్థలను వదిలేసి, చిరువ్యాపారులపై దాడులు చేస్తూ నానాయాగీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ప్లాస్టిక్‌ అమ్మకం నిషేధమే కానీ, హోల్‌సేల్‌ దుకాణాల్లో ఎందుకు అరికట్టడం లేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

రూ.కోట్లలో దోపిడీ..

ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో కవర్లు, గ్లాసుల ధరలను వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు. గతంలో నామామాత్రపు సొమ్ముతో కవర్లు లభించేవి. కానీ, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి కవర్‌, గ్లాసుకు రూ.2 నుంచి రూ.5వరకు వసూలు చేస్తుండడాన్ని బట్టి చూస్తే గ్రేటర్‌ వరంగల్‌లో దోపిడీ రూ.కోట్లల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రోజుకు స్థానికంగా 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల వినియోగం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా నిషేధం పేరిట వ్యాపారులు ధరలు పెంచి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ పిన్నావారి వీధి, బీట్‌బజార్‌, హనుమకొండ కుమార్‌పల్లిలోని హోల్‌సేల్‌ వ్యాపారులు రోజుకు భారీగా ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హోల్‌సేల్‌ షాపులపై దాడులు చేస్తాం

నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్న హోల్‌సేల్‌ షాపుల్లో తనిఖీలు చేస్తాం. చిరువ్యాపారుల కంటే ముందుగా హోల్‌సేల్‌ వ్యాపారులను కట్టడి చేస్తే అమ్మకం, వాడకం తగ్గుముఖం పడుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement