
‘ఉద్యాన’ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పండ్లు, కూరగాయల సాగు, వాటి అమ్మకాలు, పట్టుపరిశ్రమ, తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నారన్నారు. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా జిల్లాలోనే పండ్లు, కూరగాయలు సాగయ్యే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత భూమి లీజుకు తీసుకొని పట్టు సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపైనే కాకుండా పండ్లు, కూరగాయల మార్కెటింగ్ చేయడంపై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మహిళా సమాఖ్యలు లాభాల బాటలో సాగాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి అనసూయ, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.